Tuesday, February 8, 2011

The Specialization Of Hindu Temples:హిందూ దేవాలయాల ప్రత్యేకత


దేహానాం ప్రాక్తో దేవాలయహః
ప్రాచీన కాలం నుంచి హిందూ మతంలో దేవాలయాలకు విశిష్ఠమైన స్థానం కలదు. ఎంతో చరిత్ర కలిగి, మరెంతో ప్రాశస్త్యమైన దేవాలయాలు నేడు రాజకీయాల వల్ల, నాయకుల ద్వంద్వ వైఖరుల వల్ల తమ ప్రాభవాన్ని కొల్పోతున్నాయి.హిందూ సమాజానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపునిచ్చిన దేవాలయాలు జాతికి ఒక దిశానిర్దేశాన్ని చేసాయి.
. హిందువుల ఆరాధన నిమిత్తం రకరకాల పేర్లతో శివాలయాలు, విష్ణు ఆలయాలు తప్పవు. మొత్తంపై ఏదో ఒక పవిత్ర స్థలం అంటూ లేని గ్రామం, పట్టణం ఉండదు. గ్రామాలలో శివ, విష్ణు ఆలయాలు కాక, గంగానమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ మొదలైన దేవతల ఆలయాలు కూడా వెలుస్తాయి. హిందూ దేవాలయాలకు సంబంధించినంతవరకు వాటి నిర్మాణం ఎంత ప్రాచీనమైనదనే విషయం మనకు తెలియదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వేదకాలంలో విగ్రహారాధన లేదు. విగ్రహారాధన సంప్రదాయం ఉంటే తప్ప దేవాలయాల ఆవశ్యకతలేదు. కనుక వేదయుగం తర్వాతనే ఎప్పుడో దేవాలయ నిర్మాణం ప్రారంభమై ఉంటుందని స్థూలంగా చెప్పవచ్చు. యజ్ఞయాగాదులలో నిర్మించే వేదికలే ఆ తర్వాతి కాలపు ఆలయ నిర్మాణానికి ఒరవడి దిద్దాయని కొందరు అంటారు. . హిందూమతంలో నిర్గుణోపాసన, సగుణోపాసన రెండూ ఉన్నాయి. సగుణోపాసన అంటే సాకారుడైన భగవంతుని ధ్యానించి, పూజించి, ఆరాధించడం. ఈ ఆరాధన కోసం విగ్రహం అవసరమైంది. ఆలయ నిర్మాణం కోసం ఆగమశాస్త్రం అవసరమైంది. దేవాలయ నిర్మాణ శిల్పం భారతదేశంలో పరాకాష్టను చేరింది. అందులోను ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలో ఆలయ వాస్తు....అత్యద్భుతమైన శిల్ప నైపుణ్యంతో అలరారింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆలయ నిర్మాణ నైపుణ్యంలో ఏ ప్రాంతానికి తీసిపోలేదు. మొత్తం దేశంలోనే మొట్ట మొదటి శిలా నిర్మిత దేవాలయంగా గుంటూరు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వరాలయాన్ని .....చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాల ప్రభావం వల్లనో, వివిధ కాలాలలో దండయాత్రల వల్లనో శిథిలమై పోయినవి పోగా, ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన ప్రసిద్ధ దేవాలయాలు ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి. వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, వేములవాడ, కాళేశ్వరం, దాక్షారామం, మహానంది, అమరావతి మొదలైన చోట్ల గల శైవాలయాలు, తిరుమల, భద్రాచలం, సింహాచలం, యాదగిరి, మంగళగిరి, ర్యాలి, అన్నవరం ,మహబూబ్ నగర్ జిల్లాలోని సింగోటం లోని లక్శ్మీనరసింహాలయం ...మొదలైన చోట్ల గల వైష్ణవాలయాలు ప్రసిద్ధమైనవి. కాగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరాలయం, శ్రీశైలంలోని భ్రమరాంబా మల్లిఖార్జునాలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, భద్రాది రామాలయం, బెజవాడ కనకదుర్గాలయం వంటివి యావద్భారత ప్రశస్తి పొందాయి. హిందూ దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అవి కేవలం ఆరాధనాలయాలు మాత్రమే కాదు. మొత్తం హైందవ సంస్కృతికే నిలయాలు. ముఖ్యంగా గ్రామాలలో అవి ప్రజల సాంఘిక, సాంస్కృతిక, బహుళార్థ సాధక కేంద్రాలు. ప్రజా జీవితంలో వాటిది ప్రముఖ పాత్ర. పూర్వకాలంలో రాజులు, జమీందార్లు దేవాలయాలు నిర్మించేవారు. వాటి నిర్వహణకు, అర్చకుల పోషణకు విరాళాలు, మడిమాన్యాలు, అగ్రహారాలు దానం చేసేవారు. పండుగలకు, పబ్బాలకు, ఉత్సవాలకు దేవాలయాల ప్రాముఖ్యం మరింతగా పెరిగేది. అసలు దేవాలయ నిర్మాణమే గొప్ప శిల్పకళా నైపుణ్యంతో కూడి ఉండేది. అదికాక ఉత్సవాది వివిధ సమయాలలో అక్కడ నృత్య, నాటక, యక్షగాన ప్రదర్శనలు, సంగీత సభలు, పురాణ పఠనాలు, హరికథా శ్రవణాలు జరిగేవి. వాటితో పాటు సంతలు, తిరుణాళ్ళు జరిగేవి. సాధారణ సమయాలలో దేవాలయ ప్రాంగణాలలో పాఠశాలలు, ముఖ్యంగా వేదపాఠశాలలు నడిపేవారు. వైద్యశాలలుగా కూడా ఆ ప్రాంగణాలు ఉపయోగపడేవి. దేవాలయాలున్న ప్రాంతాలను పుణ్యక్షేత్రాలంటారు. ఆసేతు శీతాచలం విస్తరించిన విశాల భూఖండంలోగల అనేక పుణ్యక్షేత్రాలను దర్శించడానికి పూర్వకాలంలో కాలినడకన, గుర్రపు బళ్ళపైన, ఎడ్ల బళ్ళపైన ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు ఆధునిక వాహన సదుపాయాలు వచ్చాయి. భారతదేశం విభిన్న భాషలతో కూడినదైనా భిన్నత్వంలో ఏకత్వం అనే భావన పెంపొందడానికి హిందూమతం, దాని బాహిర రూపాలైన పుణ్యక్షేత్రాలు దోహదం చేశాయి. దేవాలయాలను, ముఖ్యంగా ప్రసిద్ధ దేవాలయాలను సాధారణంగా నదీ తీరాలోను, సముద్రతీరంలోను నిర్మించడం ఒక ఆనవాయితీ. అలా వెలసిన వాటిని పుణ్యతీర్థాలనేవారు. అయితే, అనేక ప్రఖ్యాత దేవాలయాలు పర్వత శిఖరాగ్రాలపైన, లేదా పర్వత సానువులపైన కూడా నిర్మించడం జరిగింది. నదీతీరాలలో ఉన్నా కొండలపై కట్టినా , సాధారణంగా ప్రతి దేవాలయానికి యాత్రికుల స్నాన సౌకర్యాల నిమిత్తం జలాశయం విధిగా ఉండేది. నదులు, సముద్రం ఉంటే సరే. లేకపోతే పుష్కరిణి పేరుతోనో, కొలను పేరుతోనో జల సదుపాయం ఉండవలసిందే . దేవాలయానికి హృదయం వంటిది గర్భగుడి. దానికి ప్రత్యేక ద్వారం తప్ప మరొక ద్వారంగాని, గవాక్షంగాని ఉండదు. తైల దీపాల వెల్తురులోనే దేవుడిని దర్శించాలి. అందుచేతనే గర్భగుడి చీ
Add Imageకటిని చీలుస్తూ నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుంది. గర్భ గుడి పైన గోపురం, లేదా విమానం ఉంటుంది. దానిపై కలశం. గర్భగుడి ముందు ముఖ మండపం, దాని ముందు మహా మండపం, దానిముందు ధ్వజ స్తంభం, శివాలయమైతే నంది విగ్రహం, విష్ణు ఆలయమైతే గరుడ విగ్రహం తప్పవు. గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేయడానికి ఖాళీ స్థలం ఉంటుంది. మొత్తం దేవాలయానికి రక్షణగా ఎత్తయిన ప్రాకార కుడ్యాలుంటాయి. ఆవరణలో వివిధ దేవతామూర్తులతో కూడిన చిన్న చిన్న మందిరాలు మండపాలు ఉంటాయి. ప్రధాన ద్వారంపైన చాలా దూరం కనిపించే కొన్ని అంతస్థుల గోపురం కూడా తప్పనిసరి. గర్భగుడిలోని మూలవిరాట్టు కంటె మండపాలలోను, గోపురాల మీదను, స్తంభాలపైన, మందిర కుడ్యాలపైన హిందూ శిల్పుల కళా వైదగ్ధ్యాన్ని వెల్లడిచేస్తూ అద్భుత శిల్పాలు సాక్షాత్కరిస్తాయి. నల్లటి బండరాళ్ళ నుంచి అంతటి సజీవ మూర్తులను ఎలా సృష్టించారా ఆనాటి శిల్పులు అని ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా యక్షిణులు, అప్సరసలు మొదలైన స్త్రీమూర్తుల నృత్య భంగిమాన్విత లాలిత్యం ఈనాటికీ చూపరులను ముగ్దులను చేస్తుంది. ఈ విషయంలో కాకతీయుల కాలం నాటి తెలుగు శిల్పుల ప్రతిభ మొత్తం దేశంలోనే ఏ ప్రాంతపు శిల్ప నైపుణ్యానికి తీసిపోనిది. ఇవికాక, చాలా దేవాలయాలలో బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు జరపడం ఒక ఆనవాయితి. కొన్ని దేవాలయాలకు బ్రహ్మండమైన రథాలుంటాయి. వాటిలో కూడా శిల్పకళా నైపుణ్యం గోచరిస్తుంది. గ్రామాలలో అయితే ఎడ్లు పూన్చిన బండ్లపై శివరాత్రి, విజయదశమి మొదలైన పండుగలకు ఉన్నంతలో వైభవంగానే ఊరేగింపులు జరుగుతాయి. తెలుగువారి సాంఘిక సాంస్కృతిక జీవితంలో దేవాలయాలకు విశేష ప్రాధాన్యం ఉంది..నేడు హిందూ దేవాలయాలు రాజకీయనాయకుల కబంధహస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి..... బంధ విముక్తి జరిగి పూర్వవైభవం రావాలనీ మనః పూర్వకంగా ఆకాంక్షిస్తూ......
మీ...తూర్పింటి

No comments:

Post a Comment